సిద్దిపేట: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పెరుగుతోందని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం. రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేటలోని కొండ మల్లయ్య గార్డెన్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అయ్యప్ప భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పాటు ఇస్లామిక్ దేశాలైన గల్ఫ్ దేశాల్లో సైతం మన బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. దేశాలు మారినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఉన్న అభిమానం, ఆత్మీయత తగ్గడం లేదని స్పష్టం చేశారు. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా సిద్దిపేట వంటి టైర్‌-2 నగరాల్లో కూడా అలయ్ బలయ్ వేడుకలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

అలయ్ బలయ్ స్ఫూర్తి కలకాలం నిలవాలి

రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఒకే వేదికపైకి వచ్చి ఆత్మీయంగా కలిసిమెలిసి ఉండటమే అలయ్ బలయ్ ముఖ్య స్ఫూర్తి అని ఎంపీ తెలిపారు. ప్రజల మధ్య సోదరభావాన్ని, ప్రేమాభిమానాలను పెంచే ఇలాంటి ఆత్మీయ కలయికలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. భావితరాలకు మన గొప్ప సంస్కృతిని, సనాతన సంప్రదాయాలను సురక్షితంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Oct 2026 | 05:25 PM IST
Tags: