హైదరాబాద్: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) షట్‌డౌన్‌పై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ షట్‌డౌన్ కారణంగా సుమారు 10 రోజుల పాటు యూరియా ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నడుస్తున్నందున రైతులకు యూరియా డిమాండ్ అధికంగా ఉన్న వేళ ఈ నిర్ణయం ఆందోళనకరమని పేర్కొంటూ, శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల అధికారికంగా లేఖ రాశారు.
గత ఖరీఫ్ సీజన్‌లోనూ 112 రోజుల పాటు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తిని నిలిపివేశారని ఆయన గుర్తుచేశారు. ఈ విధంగా సంస్థ తరచూ షట్‌డౌన్‌కు గురికావడం వల్ల రాష్ట్రంలో యూరియా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ కీలకపాత్ర పోషిస్తుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. తక్షణం ఈ షట్‌డౌన్‌ను ముగించి, యూరియా ఉత్పత్తిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
అలాగే, ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉత్పత్తి లోటును ఇతర దేశీయ ప్లాంట్లు లేదా దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని విన్నవించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగినంత యూరియా నిల్వలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తం చేశారు. కాగా, రామగుండం ఎరువుల కర్మాగారంలో శనివారం నుంచి షట్‌డౌన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.


