శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, వివిధ కమిటీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను అత్యంత వేగవంతం చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సామ రామ్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌యూఐలో క్రియాశీలక కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా, అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలు అందించిన సామ రామ్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి చట్టసభకు పంపాలని కోరారు. టీవీ డిబేట్లలో పార్టీ వాదనను గట్టిగా వినిపించిన ఆయనకు పట్టభద్రులు పట్టం కట్టాలని సూచించారు.

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6తో ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఫారం-18 ద్వారా ఓటు నమోదు చేసుకునేలా నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు రెండు లక్షల మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారని, ఇంకా అనేక మంది అర్హులు మిగిలి ఉన్నందున గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమీపంలోని మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలు లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ కార్డు, డిగ్రీ మెమోతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు, యూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మహేశ్వరం ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మాల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, చేవెళ్ల ఇన్‌చార్జి భీంభరత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 22 Oct 2026 | 09:34 PM IST
Tags: