హైదరాబాద్: తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జర్నలిస్టుల దశాబ్దాల సొంతింటి కలను త్వరలోనే సాకారం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం కీలక ప్రకటన చేశారు. వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోందని వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా, అన్ని అర్హతలు కలిగిన జర్నలిస్టులకు వాసయోగ్యమైన ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో పలుమార్లు విస్తృతంగా చర్చించామని, జర్నలిస్టుల హౌసింగ్ సమస్యపై ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి నివాస స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు.

గతంలో ఏర్పడిన న్యాయపరమైన సమస్యల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైందని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. "2008లోనే జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూముల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే 2022లో ఆయా న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సెప్టెంబర్ 8వ తేదీన జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూమిని అధికారికంగా అప్పగించే చర్యలు వేగవంతం చేశాం" అని ఆయన వివరించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ న్యాయం జరిగేలా పారదర్శకంగా భూముల కేటాయింపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Oct 2026 | 05:11 PM IST
Tags: