హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన భీకర వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 23 మందిని ప్రాథమికంగా గుర్తించినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీరికి సంబంధించిన సమగ్ర వివరాలను ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణ ప్రజల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటోందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తక్షణ సహాయక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
నేపాల్ రాజధాని కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయంతో పాటు అక్కడి స్థానిక అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల ప్రస్తుత పరిస్థితి మరియు వారి భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేక హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బాధితుల కుటుంబ సభ్యుల సౌకర్యార్థం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్ర సచివాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బాధితుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు, సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. నేపాల్‌లో ఇంకా ఎవరైనా తెలంగాణ వాసులు చిక్కుకుని ఉంటే వారి వివరాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి కోరారు. సమాచారం అందిన వెంటనే వారి పరిస్థితిని తెలుసుకుని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.


