మంచిర్యాల, ఆగస్టు 27: మంచిర్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ దిశగా సంబంధిత శాఖల అధికారులు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్య రహిత జిల్లా సాధనే లక్ష్యంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 49 కేసులు నమోదు కాగా, అందులో 103 మందిని గుర్తించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగదారులను గుర్తించి కోర్టు ద్వారా సుమారు 30 మందిని డ్రగ్ డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించినట్లు ఆయన వివరించారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైనా గంజాయి తదితర అక్రమ మొక్కలను సాగు చేస్తున్నారా అనే కోణంలో నిరంతరం పరిశీలించాలని, అలాంటి వారిని కఠినంగా గుర్తించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, అనధికార బెల్టుషాపులను పూర్తిగా నియంత్రించాలని అధికారులను కోరారు. విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో బెల్టు షాపులు నిర్వహించడం, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చట్టరీత్యా నిషేధించబడ్డాయని, ఆ దిశగా తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష
మాదకద్రవ్యాల నియంత్రణ సమావేశం అనంతరం జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో రోడ్డు భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని, వాహనదారులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ఫిట్‌నెస్ లేని పాఠశాల బస్సులు, ఇతర వాహనాలపై తక్షణమే కొరడాఝుళిపించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదకర ప్రాంతాల్లో వేగ నిరోధక బోర్డులు (స్పీడ్ బ్రేకర్లు), తగిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, సబ్ కలెక్టర్ మనోజ్, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, వివిధ డివిజన్ల ఏసీపీలు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


