మహేశ్వరం: ఈద్-మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ర్యాలీని అత్యంత ఘనంగా నిర్వహించారు. హజ్రత్ మహబూబ్ షుబాని గౌసేపాక్ దర్గా మత పెద్ద ఇబ్రహీం ఖాన్ ఆధ్వర్యంలో విద్యా వికాస్ స్కూల్ నుంచి దర్గా వరకు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున కొనసాగింది.
ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త బోధించిన సోదరభావం, దయ, కరుణ, నిజాయితీ, మానవత్వం, శాంతి వంటి ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని కోరారు. కులమతాలకు అతీతంగా ప్రపంచ శాంతి, మానవాళి సంక్షేమం కోసం ప్రవక్త ఇచ్చిన సందేశాన్ని ప్రజలందరూ పాటించాలని సూచించారు. ర్యాలీలో పాల్గొన్న యువత, భక్తులు అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలని, మతం లేదా కులం పేరుతో ఇతరులను దూషించవద్దని మత పెద్దలు హితవు పలికారు. ర్యాలీ విజయవంతానికి సహకరించి తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన మహేశ్వరం ఎస్‌హెచ్‌ఓ, సీఐ రాఘవేందర్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, మహేశ్వరం ఎస్‌ఐ ప్రసాద్, ఇంటెలిజెన్స్ పోలీస్ మల్లేష్, మాజీ ఉపసర్పంచ్ లతీఫ్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు వార్డు సభ్యులు షాహాబుద్దీన్ ఖాన్, నహీం ఖాన్, ఫిరోజ్ ఖాన్, షానవాజ్ ఖాన్, షేక్ ఛాన్ పాషా, గని ఖాన్, అంజాద్ ఖాన్, ఆఫ్రోజ్ ఖాన్, పేరోజ్ ఖాన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


