మహేశ్వరం, ఆగస్టు 26: మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని గ్రాండ్ ఎరీనా వేదికగా నిర్వహించిన ‘ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్ లీగ్’ (ఈడబ్ల్యూసిఎల్) సీజన్-1 గ్రాండ్ ఫినాలే వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ లీగ్‌లో మొత్తం 16 జట్లు హోరాహోరీగా తలపడగా.. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన గోల్డెన్ ఈగల్స్ జట్టు ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌లో గోల్డెన్ ఈగల్స్ మొదటి స్థానంలో నిలవగా, థండర్ హావాక్స్ జట్టు రెండో స్థానాన్ని, ఫాల్కన్స్ జట్టు మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. విజేతలకు ఈడబ్ల్యూసిఎల్ నిర్వాహకులు ట్రోఫీలు, మెడల్స్‌తో పాటు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.
ఈ ముగింపు వేడుకలకు ఈడబ్ల్యూసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రవి సుబ్రహ్మణ్యంతో పాటు జింబాబ్వే ఎంపీ ట్షబాంగు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈడబ్ల్యూసిఎల్ ద్వారా అంతర్జాతీయ ప్రతిభను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయడంతో పాటు మహిళా క్రికెటర్లకు జాతీయ స్థాయిలో మరింత మెరుగైన వేదిక కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఇద్దరు క్రీడాకారులలో ఒకరికి టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనం, మరొకరికి రూ.లక్ష నగదు బహుమతిని బహుకరించారు. ఈ గ్రాండ్ ఫినాలే వేడుకల్లో క్రీడాభిమానులు, పలువురు ప్రముఖులు, నిర్వాహకులు, క్రీడాకారిణులు పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.


