మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని పేరేడు 1, 2 పరిధిలో ఉన్న 4.06 గుంటల భూమి గ్రామకంఠం, ప్రభుత్వ భూమి లేదా దేవాలయ భూమి కాదని, అది పూర్తిగా పట్టా భూమి అని గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య స్పష్టం చేశారు. ఈ భూమిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం మహేశ్వరంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. 1950 నుంచి ఉన్న పత్రాలు, గత ఒప్పందాలు, కోర్టు తీర్పుల వివరాలను మీడియాకు వెల్లడించారు.
గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ.. పేరేడు భూములకు సంబంధించి అప్పటి దేవాలయ కమిటీతో కుదిరిన ఒప్పందం ప్రకారమే కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయని తెలిపారు. భూమిపై సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని కోరుతూ పది రోజుల క్రితమే మహేశ్వరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు.
1950 నుంచి పట్టా భూమిగానే నమోదు
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య మాట్లాడుతూ.. పేరేడు 1, 2 భూమి 1950 నుంచి పట్టా భూమిగానే రికార్డుల్లో నమోదై ఉందని వివరించారు. 1991లో సయ్యద్ అసునుద్దిన్ ఆధ్వర్యంలో లేఅవుట్ ఏర్పాటు చేసి, గ్రామపంచాయతీ నుంచి ఎన్వోసీ కూడా పొందారని తెలిపారు. 1992లో నమోదైన కేసుపై 1998లో ఇబ్రహీంపట్నం కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అది దేవాలయ భూమి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిందన్నారు. 2002లో శివగంగా రాజరాజేశ్వరి దేవస్థానం కమిటీ ఆ స్థలం గ్రామకంఠం కాదని ఒప్పంద పత్రం ఇచ్చిందని గుర్తుచేశారు.
ఈ లేఅవుట్లో ప్రస్తుతం 72 మంది పట్టాదారులు ఉన్నారని, అప్పటి మార్కెట్ విలువ ప్రకారమే స్థలాలు కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతో స్థానికంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి రికార్డుల ఆధారంగా వివాదానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.


