మహేశ్వరం: పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ)- హైదరాబాద్ ఆధ్వర్యంలో మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA)’ కార్యక్రమంపై రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ‘వార్త’ మీడియా వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి (ఐపీఎస్) ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిలించి ప్రారంభించారు. ఈగల్ ఫోర్స్ పోలీస్ సూపరింటెండెంట్ రావుల గిరిధర్ (ఐపీఎస్), పీఐబీ- హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, మహేశ్వరం ఎంపీడీవో ఎన్. శారదమ్మ తదితరులు ఈ వర్క్‌షాప్‌లో విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ భూతాన్ని ఎదుర్కొనేందుకు కేవలం చట్టపరమైన ఆంక్షలు మాత్రమే సరిపోవని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే దాన్ని సమర్థంగా కట్టడి చేయగలమని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందన్నారు. మాదకద్రవ్య నివారణ చర్యలు ఇళ్లలోనే, పాఠశాలల్లోనే మొదలుకావాలని సూచించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ సకాలంలో సమాచారాన్ని ఇస్తే డ్రగ్స్ ముప్పును ఎదుర్కోవచ్చని తెలిపారు. మీడియా సిబ్బంది ధ్రువీకృత సమాచారాన్ని ప్రసారం చేస్తూ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతను ముందస్తుగా జాగరూకులను చేయాలని కోరారు.
తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం నేడు తీవ్రమైన సామాజిక, శాంతిభద్రతల, జాతీయ భద్రతా సవాలుగా పరిణమించిందన్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి తెలంగాణలో దాదాపు 8 వేల కేజీల గంజాయిని ఈగల్ ఫోర్స్ సీజ్ చేసిందని తెలిపారు. బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ ద్వారా యువతలో అవగాహన పెంపొందించడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్నారు. మైనర్ల వివరాలను, బాధితుల గోప్యతను కాపాడాలని సూచించారు.
పీఐబీ- హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ ప్రారంభోపన్యాసం చేస్తూ.. కచ్చితమైన సమాచారమూ, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ విధానాలతో జర్నలిస్టులను సన్నద్ధం చేయడమే పీఐబీ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం జర్నలిస్టులు వక్తలతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పీఐబీ- హైదరాబాద్ మీడియా- కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మహేశ్వరం పరిసర ప్రాంతాలకు చెందిన మీడియా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


