షాద్‌నగర్: షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకుడు కరుణాకర్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు కరుణాకర్ నిరంతరం శ్రమిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. యువతకు, పట్టభద్రులకు ఆయన నియామకం ఎంతో బలాన్ని చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 2023 కంటే ముందు డిగ్రీ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులందరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

నవంబర్ 6లోగా ఓటరు నమోదు పూర్తి చేయాలి

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి ఓటు అత్యంత విలువైనదని, ప్రజల సమస్యలను చట్టసభల్లో వినిపించే సమర్థులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు ప్రధాన అస్త్రమని నాయకులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించి రాబోయే నవంబర్ 6వ తేదీ లోపు ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ నల్లమొని శ్రీధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్రాజ్ గౌడ్, గిరిజన కాంగ్రెస్ నాయకులు రఘ నాయక్, ఫారూఖ్ నగర్ మండల ప్రెసిడెంట్ రైకల్ శ్రీనివాస్, పెంటయ్య, సీనియర్ నాయకులు బి. సిద్ధార్థ, గోదా మాధవులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Oct 2026 | 09:24 PM IST
Tags: