కరీంనగర్: ప్రత్యేక ఓటరు సవరణ (సర్‌) ప్రక్రియ గ్రామాల్లో తీవ్ర సమస్యలను సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓటర్ల వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు నిర్వహించిన గ్రామసభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫారం నింపించిన వారందరి ఓట్లు సక్రమంగా ఉన్నాయని భావించిన ఓటర్లకు పెద్ద ఎత్తున నోటీసులు రావడంతో తలపట్టుకుంటున్నారు. తాము అన్ని వివరాలు సక్రమంగా ఇచ్చినా ఓట్లు ఎలా తొలగిపోతాయని, మళ్లీ కొత్తగా ఓటు కోసం ఎందుకు నమోదు చేసుకోవాలని ప్రజలు బీఎల్‌వోలను, అధికారులను నిలదీస్తున్నారు.

భారీగా ఓట్లు తొలగింపు - డిజిటలైజేషన్‌లో తప్పులు

గ్రామాల్లో అందజేస్తున్న నోటీసులు ప్రజలకు సరిగ్గా అర్థం కాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏ కారణం చేత ఓటును తొలగిస్తున్నారనే స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1,77,157 మందికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వేకు ముందు జిల్లా వ్యాప్తంగా 10,89,090 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 9,11,933కి పడిపోయింది. అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గంలో 1,00,618 ఓట్లు తొలగిపోయాయి. హుజూరాబాద్‌లో 28,245, మానకొండూర్‌లో 19,668, చొప్పదండిలో 28,668 ఓట్లు కోల్పోయినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఓటర్లు ఇచ్చిన ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజేషన్‌ చేసే క్రమంలో పెద్ద ఎత్తున తప్పులు దొర్లినట్లు స్పష్టమవుతోంది. ఎపిక్‌ నంబర్లలో సున్నాకు బదులుగా 'ఓ' (O) అక్షరాన్ని నమోదు చేయడం లేదా దీనికి విరుద్ధంగా పేర్కొనడంతో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ఎక్కువగా వృద్ధుల ఓట్లు మాయమవడంతో తాము ఎక్కడికి వెళ్లాలని, కొత్తగా ఎలా నమోదు చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోనే 5,67,67 మంది ఓటర్లు ఉండగా, సరైన వివరాలు లేవంటూ 9,779 మందికి నోటీసులు ఇచ్చారు. నో మ్యాపింగ్ కారణంగా 4,486 మంది తిరస్కరణకు గురయ్యారు. సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం ఉన్నప్పటికీ, తక్కువ గడువు ఉండటంతో తుది జాబితాపై ఆందోళన వ్యక్తమవుతోంది.

కళాభారతిలో ప్రత్యేక కౌంటర్లు

సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్‌లోని కళాభారతి ఆడిటోరియంలో 20 ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నోటీసులు అందుకున్నవారు నిర్ణీత తేదీ, సమయంలో అవసరమైన ఆధారాలతో హాజరై వివరాలను సరిచేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 22 వరకు ఆధారాలను పరిశీలించి తుది ఓటరు జాబితాను రూపొందిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 01:21 AM IST
Tags: