హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ అల్పపీడన ప్రభావంతో ఈనెల 29న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ప్రధానంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ఐఎండీ ఆయా జిల్లాలకు తీవ్ర హెచ్చరికగా 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
అలాగే అదే రోజున కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది.


