కరీంనగర్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడక వరినాట్లు గణనీయంగా తగ్గాయి. రాబోయే యాసంగిలోనూ వరి సాగు చేయవద్దని ప్రభుత్వం సూచిస్తుండటంతో మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి ఒక్కసారిగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరోవైపు బియ్యం ధరలు క్రమంగా పెరుగుతుండటంతో మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు ముందుగానే నాణ్యమైన ధాన్యాన్ని సమకూర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల వద్దకే నేరుగా వెళ్లి సన్నవడ్లను కొనుగోలు చేయడానికి అమితాసక్తి చూపుతున్నారు.
గతంలో రైతులు తమ ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లు లేదా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కష్టపడి తరలించి విక్రయించేవారు. కానీ ప్రస్తుతం వ్యాపారులు నేరుగా గ్రామాల్లోని రైతుల వద్దకే వెళ్లి, అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించి మరీ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు, శ్రమ పూర్తిగా తప్పుతున్నాయి. స్థానిక అవసరాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట, గుంటూరు, మండపేట, గుడివాడతో పాటు తెలంగాణలోని మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, ఖమ్మం ప్రాంతాలకు సైతం వ్యాపారులు ఈ ధాన్యాన్ని భారీగా తరలిస్తున్నారు.
జమ్మికుంట మండలంలో సుమారు 12 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో దాదాపు 9 వేల ఎకరాల్లో కేవలం సన్నరకం వడ్లే సాగు చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్‌లో సన్నవడ్ల రకాలను బట్టి మంచి ధర లభిస్తోంది. పచ్చివడ్లు కేవీఎం-1638 క్వింటాల్‌కు రూ.3,300 ఉండగా, జైశ్రీరామ్ క్వింటాల్‌కు రూ.4,000, బీపీటీ రూ.3,300, ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటాల్‌కు రూ.4,000 వరకు పలుకుతోంది. మున్ముందు మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు, వడ్ల గిరాకీ ఏ విధంగా ఉండనుందనేది వేచిచూడాల్సిందే.


