మహేశ్వరం, ఆగస్టు 27: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని దిల్వార్‌గూడ గ్రామంలో ఆలూరి శ్రీకాంత్ (31) అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఆయన బంధువు నర్రె జ్యోతి మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడకు చెందిన ఆలూరి శ్రీకాంత్ సుమారు ఐదేళ్ల క్రితం గుమ్మడివెల్లి గ్రామానికి చెందిన మనీషాను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగినప్పటికీ, గత రెండేళ్లుగా కుటుంబ కలహాలు తలెత్తాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత ఎనిమిది నెలల క్రితం వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ తర్వాత శ్రీకాంత్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అప్పట్లో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. గత వారం క్రితం కడ్తాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్రీకాంత్‌ను గుర్తించగా, అప్పటి నుంచి ఆయన దిల్వార్‌గూడలోని తమ బంధువు ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మార్చి 23న సాయంత్రం 7.30 గంటల సమయంలో జ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల గ్రామమైన బ్రహ్మణపల్లికి వెళ్లింది. రాత్రి 11.30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి శ్రీకాంత్ అక్కడ కనిపించలేదు. ఆయన సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తేలింది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు.
అదృశ్యమైన శ్రీకాంత్ ఎత్తు సుమారు 5.5 అడుగులు ఉంటారని, తెల్లటి ఛాయ, ఓవల్ ముఖాకృతి కలిగి ఉండి తెలుగు మాట్లాడుతాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదృశ్యమైన సమయంలో ఆయన బ్రౌన్ కలర్ షర్ట్, బ్లూ కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. శ్రీకాంత్ ఆచూకీ కనుగొని, సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారురాలు పోలీసులను అభ్యర్థించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.


