హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ ఉత్సవాలను అత్యంత శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి గత ఏడాది ఏర్పాట్లు, ఎదురైన సమస్యలు, ఈ ఏడాది చేపట్టాల్సిన భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో సుమారు 25,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఈ ఏడాది కూడా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

ఈ సమావేశంలో పోలీస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, హైడ్రా, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, జలమండలి, ఆర్టీసీ, టూరిజం తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన తేదీ వివరాలను నిర్వాహకులు ముందుగానే స్థానిక పోలీసులకు తెలియజేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు అందుబాటులో ఉండడంతో పాటు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

నిమజ్జన కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, రోడ్ల మరమ్మతులు, బ్యారికేడింగ్, లైటింగ్, తాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తామని సీపీ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఊరేగింపు మార్గాల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని, పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి మాట్లాడుతూ, నిర్దేశిత సమయంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు ఉత్సవాల విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని హామీనిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Aug 2026 | 01:08 AM IST
Tags: