హైదరాబాద్: నగరంలోని చారిత్రాత్మక మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా అక్కడ సాగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ వద్ద జరుగుతున్న పనులను అధికారులతో కలిసి ఒక్కొక్కటిగా పరిశీలించారు. కొనసాగుతున్న పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా అధికారులు వివరాలు అందజేయగా, ప్రణాళికలను పూర్తిగా పరిశీలించిన ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యుత్తమ డిజైన్లతో ఈ ప్రాంతాన్ని పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ఓపెన్-టాప్ జీపులో ప్రయాణించి మొత్తంగా పరిశీలించిన ఆయన, మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లి స్వయంగా పరిశీలించారు.
చెరువులోకి మురుగు నీరు చేరకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, అలాగే చెరువు నుంచి మూసీలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాను విస్తరించాలని చెప్పారు. పర్యాటకులు చెరువులో వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదించేలా డిజైన్ చేయాలని, చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్‌లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉన్నందున, నగరానికి వచ్చే విదేశీ, దేశీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఏర్పాట్లు జరగాలని పేర్కొన్నారు.
ఈ ఆకస్మిక పర్యటన సందర్భంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు, మున్సిపల్ శాఖ ప్రముఖులు పాల్గొన్నారు.


