హైదరాబాద్: పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న తెలంగాణ గురుకులాల (TGSWREIS) విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన నీట్ (NEET) ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థులతో పాటు, అంతర్జాతీయ క్రీడా వేదికపై స్వర్ణ పతకంతో మెరిసిన యువ అథ్లెట్ సాయి ప్రవల్లికను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మర్యాదపూర్వక భేటీ
శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లో ముఖ్యమంత్రితో విద్యార్థులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీట్‌లో ఉన్నత ర్యాంకులు సాధించి వైద్య విద్య వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. పేదరికాన్ని జయించి ఉన్నత లక్ష్యాలను సాధించిన విద్యార్థుల పట్టుదలను, వారికి నిరంతరం మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు.
స్వర్ణ పతక విజేత సాయి ప్రవల్లికకు ప్రశంసలు
తొలిసారిగా జరిగిన ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి స్వర్ణ పతకం అందించిన అథ్లెట్ సాయి ప్రవల్లికపై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిందని కొనియాడుతూ, భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడా వేదికలపై మరింత ఉన్నత పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, SCDD కార్యదర్శి విజయేంద్ర బోయి, TGSWREIS కార్యదర్శి కంభంపాటి శారద, జాయింట్ సెక్రెటరీ సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


