షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఎస్ఎఫ్ఐ షాద్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను అర్థవంతంగా నిర్వహించారు. ‘ఆడపిల్లలను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు సిబ్బందికి, మున్సిపాలిటీ కార్మికులకు విద్యార్థులు స్వయంగా రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజంలో ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలతో పాటు, పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలను విద్యార్థులు, నాయకులు ఎంతగానో కొనియాడారు. ఎస్ఎఫ్ఐ షాద్‌నగర్ డివిజన్ సెక్రటరీ వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎప్పుడూ పోలీసుల సేవలను గౌరవిస్తారని, ప్రజల కోసం కష్టపడుతున్న వారికి తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలిపారు. సమాజంలో మున్సిపాలిటీ కార్మికుల శ్రమ మరువలేనిదని పేర్కొంటూ వారికి ముందస్తు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ కుటుంబానికి దూరంగా విధుల్లో ఉంటూ భద్రత, పరిశుభ్రతను అందిస్తున్న వారి సేవలు అభినందనీయమన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతకు ప్రతీక అని, వారితో సోదరభావాన్ని పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్షుడు ఆదిల్‌తో పాటు రామ్‌చరణ్, శివ వంశీ, విష్ణు తదితర విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా ఈ వేడుకలను విజయవంతం చేశారు.


