మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెండ్యాల్ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలిలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 15 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. ఈ భారీ బతుకమ్మ చుట్టూ చిన్న బతుకమ్మలను ఏర్పాటు చేసి మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. గ్రామంలోని మహిళలు, ఆడపడుచులు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డీజే లైట్లు, డోలు వాయిద్యాల హోరు మధ్య గ్రామస్థులు సందడి చేశారు.

గ్రామ సర్పంచ్ జైతవరం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యుల పూర్తి సహకారంతో ఈ సద్దుల బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతిని సమున్నతంగా చాటారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Oct 2026 | 10:34 PM IST
Tags: